మీరు నావెంటే ఉండాలి!
మీరు నావెంటే ఉండాలి!
ఏ గొంతులో మాట కూడా పాటవుతుందో... ఏ గొంతులో ప్రతి పాటా కోకిలమ్మ స్వరమవుతుందో... అలాంటి ఎవర్‌గ్రీన్ గాయని ఆశా భోంస్లే తాజాగా తన 82 ఏట అడుగుపెట్టారు. వివిధ భాషల్లో దాదాపు 12 వేలకు పైగా పాటలు పాడిన ఈ ‘పద్మవిభూషణ్’ పురస్కార గ్రహీత ఇన్నేళ్ళ తన స్వర ప్రయాణానికి సహకరించిన సినీ వర్గీయులకూ, అభిమానులకూ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. వారందరి అభిమానం, అండదండల వల్లే దేశంలోని బహుముఖ ప్రజ్ఞావంతులైన గాయనీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకోగలిగినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘నా జన్మదినం సందర్భంగా అభినందనలు తెలిపిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. మీ అండదండలు లేనిదే నేను నా లక్ష్యాలను చేరుకోగలిగేదాన్ని కాదు. రాబోయే రోజుల్లో కూడా మీరు నా వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఆశా భోంస్లే పేర్కొన్నారు. సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కు చెల్లెలైన ఆశా భోంస్లే అలనాటి మధుబాల, హెలెన్, ఆశా పారేఖ్‌ల దగ్గర నుంచి ఇటీవలి ఊర్మిళా మాతోండ్కర్, కరీనా కపూర్ దాకా అందరికీ తన గళంతో ఎన్నో సూపర్‌హిట్ గీతాలిచ్చారు. ఇప్పటికీ ఆమె వేదికపై పాటలు పాడుతుంటే, హాలు నిండిపోవాల్సిందే. ఈ ఏడాది ప్రథమార్ధంలో ప్యారిస్‌లో జరిగిన ఆశా భోంస్లే సినీ సంగీత విభావరిలో ఆ దృశ్యమే కనపడింది

Comments